స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండన్ కు 151 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈజీ జెట్ విమానం, ఉగ్రభయంతో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఎంతో మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారని కొంతమంది ప్రయాణికులు విమానం సిబ్బందితో చెప్పారు. సమాచారాన్ని పైలట్లకు చేరవేయగా, వారు ఏటీసీకి విషయాన్ని తెలిపారు. దీంతో విమానాన్ని జనసంచారం అంతగా ఉండని కొలోంగ్ లోని బాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి, ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపారు. ఆపై ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి బ్యాక్ ప్యాక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాక్ ప్యాక్ లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అన్న విషయం తెలియరాలేదు. వీరు ఎవరు? విమానంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనతో యూరప్ లో గత రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 10 విమానాలను దారి మళ్లించగా, 20 విమానాల ప్రయాణం ఆలస్యమైంది. ఇటీవలి కాలంలో జర్మనీ, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులు పెరగడంతో, ఏ చిన్న అనుమానం వచ్చినా, అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

Leave a Reply

© 9499 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO