వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడాలని చేసిన యత్నాలను తిప్పికొట్టామని సైన్యం ప్రకటించింది. 96 గంటల వ్యవధిలో 13 మంది మిలిటెంట్లను హతమార్చామని, వీరిని ఇండియాలోకి చొప్పించేందుకు పలు చోట్ల పాక్ కాల్పులు జరిపి, భారత సైన్యం దృష్టిని మరల్చాలని చూసిందని, పాక్ కాల్పులకూ దీటుగా సమాధానం చెప్పామని ఉధంపూర్ కేంద్రంగా నడుస్తున్న నార్త్ రన్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఉగ్రవాదులు చొరబడాలని చూశారని, గురేజ్, మాచిల్, నౌగామ్, యూరీ సెక్టార్లలో వారి ప్రయత్నాలను అడ్డుకున్నామని వెల్లడించింది. వీరి నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. గురేజ్, యూరీ సెక్టార్లలో సరిహద్దుల వెంట ఇంకా సెర్చ్ ఆపరేషన్ సాగుతోందని పేర్కొంది. కాగా, ఈ ఉదయం కూడా పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. రెండు ప్రాంతాల నుంచి భారత పోస్టులు లక్ష్యంగా పాక్ తేలికపాటి మోర్టార్లను ప్రయోగిస్తుండగా, బీఎస్ఎఫ్ జవాన్లు సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు.

Leave a Reply

© 5757 Namo Telangana · Subscribe: RSS Twitter · Powered by Plexus KPO